ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన ఐదు పిటిషన్లపై హైకోర్టు గురువారం, అక్టోబర్ 1న కీలక తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే అన్ని పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందన్నదానిపై రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల్లోనూ ఆసక్తి నెలకొంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ప్రధానంగా దాఖలైన పిటిషన్. మరో పిటిషన్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. అదే సమయంలో రాజ్యాంగబద్ధమైన గడువులోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మరో పిటిషన్‌ దాఖలైంది.

ఇక కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీటితో పాటు ఎన్నికల ప్రక్రియ, రిజర్వేషన్లకు సంబంధించిన మరో అంశంపైనా పిటిషన్‌ దాఖలైంది. ఈ ఐదు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్, రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తూనే రాజకీయ పార్టీలు స్థానిక ఎన్నికల సన్నాహాలు ముమ్మరం చేశాయి. కూటమి పార్టీల్లో ఇప్పటికే జిల్లాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. మూడు పార్టీల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థులను ఖరారు చేస్తామని నేతలు చెబుతున్నారు.

ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికల నిర్వహణ, సమన్వయం, పర్యవేక్షణ కోసం గతంలో ఏర్పాటు చేసిన కమిటీలను రద్దు చేసి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకుల మధ్య సమన్వయంపై ఈ కమిటీలు దృష్టి సారించనున్నాయి.

By Rajini