
అమరావతి గ్రామకంఠాల మినహాయింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా భూములకు మినహాయింపులు ఇచ్చారన్న ఫిర్యాదుల నేపథ్యంలో గ్రామకంఠాల పరిధిలో జరిగిన భూముల మినహాయింపులను పునఃపరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించిన అనంతరం రాజధాని పరిధిలో భూసమీకరణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా అమరావతి పరిధిలోని పలు గ్రామాలను, వాటికి ఆనుకుని ఉన్న పశువుల కొట్టాలను గ్రామకంఠాలుగా పరిగణించి భూసమీకరణ నుంచి మినహాయించారు.
అయితే తమ భూములను కూడా గ్రామకంఠాల కింద పరిగణించి భూసమీకరణ నుంచి మినహాయించాలని పలువురు రైతులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. సీఆర్డీఏ రూపొందించిన నిబంధనల మేరకు ఈ దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం కొంతమంది రైతుల భూములకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మినహాయింపులపై కొన్ని గ్రామాలకు చెందిన వారు మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు.
సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా కొందరు రైతుల భూములను గ్రామకంఠాల కింద మినహాయించారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంపై మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన అనంతరం గ్రామకంఠాల మినహాయింపులపై సమగ్రంగా పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు అనుగుణంగానే మినహాయింపులు ఇచ్చారా? లేదా? అనే అంశాన్ని లోతుగా పరిశీలించి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. పరిశీలన అనంతరం నివేదికను సీఆర్డీఏకు అందించాలని స్పష్టం చేశారు.
