స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలి మెట్టు అని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతిలోని కచ్ఛపి ఆడిటోరియంలో నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ అధ్యక్షతన శుక్రవారం జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను నిరంతర ప్రక్రియగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

పరిశుభ్రత అనేది కేవలం పారిశుధ్య సిబ్బంది బాధ్యత కాదని ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత లక్ష్యాలను సాధించగలమని చెప్పారు. తిరుపతి నగరంలో రోజుకు సుమారు 250 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని తెలిపారు. ప్రస్తుతం 70 నుంచి 80 టన్నుల వ్యర్థాలను మాత్రమే ప్రాసెస్‌ చేయగలుగుతున్నామని మిగిలిన చెత్తను శ్రీరామాపురం డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నామని చెప్పారు. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో రోజుకు 600 మెట్రిక్‌ టన్నుల చెత్తను విద్యుత్‌ శక్తిగా మార్చే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ప్లాంట్‌ను 2027 డిసెంబరు నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ మాట్లాడుతూ గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారి జీవిత సందేశాలను స్ఫూర్తిగా తీసుకుని పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా స్థాయిలో పారిశుధ్య నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల సిబ్బంది, సంస్థలకు కలెక్టర్ అవార్డులను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ సుబ్బరాయుడు, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, డీపీవో సుశీలాదేవి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శారదాదేవి, డీసీ అమరయ్య, స్మార్ట్‌ సిటీ జీఎం చంద్రమౌళి, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యువ అన్వేష్‌, రెవెన్యూ అధికారి రవి, టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనపాక లక్ష్మి, రాష్ట్ర బ్యూటిఫికేషన్‌ చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహ యాదవ్‌, ఎస్వీబీసీ చైర్మన్‌ శ్రీధర్‌ వర్మ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రకోటి సదాశివం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత, తిరుపతి టీడీపీ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్‌, గంగమ్మ ఆలయ చైర్మన్‌ మహేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

By Rajini