వైసీపీకి మరో కీలక నేత రాజీనామా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే, విజయనగరం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు వెల్లడించారు. గౌరవం లేని చోట తాను, తన అనుచరులు కొనసాగలేమని స్పష్టం చేశారు. శనివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన బడ్డుకొండ అప్పలనాయుడు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

జగన్ నియంతలా వ్యవహరించారని ఆరోపించారు. వైసీపీ ఒక ‘లిమిటెడ్ కంపెనీ’లా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణంగానే గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసిందని అన్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఓడిపోతారని జగన్ చేసిన వ్యాఖ్యలు, వైసీపీకి తీవ్ర నష్టం కలిగించాయని బడ్డుకొండ అప్పలనాయుడు విమర్శించారు.

పార్టీకి క్రమశిక్షణ కమిటీ అంటూ ఏదైనా ఉందా? అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. సొంత పార్టీ కావడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ను నమ్ముకున్న వేలాది కుటుంబాలు నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన బంధువు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను ఎలాంటి కారణం లేకుండా సస్పెండ్ చేశారని బడ్డుకొండ అప్పలనాయుడు ఆరోపించారు.

చిన్న శ్రీనుకు బావ అయిన బొత్స సత్యనారాయణను కూడా సస్పెండ్ చేయగలరా? అంటూ వైసీపీ అగ్రనేతలకు సవాల్ విసిరారు. బడ్డుకొండ అప్పలనాయుడు గతంలో నెల్లిమర్ల ఎమ్మెల్యేగా, విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. మజ్జి శ్రీనివాసరావుకు ఆయన సమీప బంధువు. ఇటీవలే విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి, కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు.

అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన అనుచరులుగా ఉన్న పలువురు జడ్పీటీసీలు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఇదే సమయంలో విజయనగరం జిల్లాలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు. వరుస రాజీనామాలతో జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయనే రాజకీయ చర్చ కొనసాగుతోంది.

By Rajini