
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు పరిసరాల్లో ఏడు కూడళ్ల వద్ద చేపట్టాలని ప్రతిపాదించిన రూ.1,090 కోట్ల స్టీల్ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టును జీహెచ్ఎంసీ రద్దు చేసింది. వన్‌వే విధానం అమలు చేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో, భారీ వ్యయంతో కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో జూబ్లీ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు గేట్, ముగ్ధా జంక్షన్, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన పనులను నిలిపివేశారు. ఈ ప్రాజెక్టు కోసం కాంట్రాక్టర్లైన కేఎన్ఆర్, మేఘా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేశారు.
మరోవైపు, పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు కొత్త ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమమైంది.
హైదరాబాద్ నగరానికి కీలకమైన కేబీఆర్ పార్కు పరిసరాల్లో ఏడు ప్రధాన కూడళ్ల వద్ద ప్రతిపాదించిన స్టీల్ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి బ్రేక్ పడింది. మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీలుగా చేపట్టాలని నిర్ణయించిన ఈ ప్రాజెక్టులను రద్దు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
ఈ నిర్మాణ పనులు ప్రారంభిస్తే నగరంలోని ప్రధాన మార్గాల్లో కొంతకాలం పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రత్యామ్నాయంగా వన్‌వే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.
నెల రోజుల క్రితం అమలు చేసిన వన్‌వే విధానంతో తొలుత వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఒకట్రెండు రోజుల్లోనే పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. మూడో రోజు నుంచి ప్రధాన సిగ్నళ్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా సాఫీగా కదలడం ప్రారంభించాయి. దీంతో భారీ నిర్మాణాలు చేపట్టకుండానే కేబీఆర్ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చని అధికారులు భావించారు.
ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గిన నేపథ్యంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్టీల్ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌లు నిర్మించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం రూపొందించిన రద్దు తీర్మానానికి శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘం సమావేశంలో ఆమోదం లభించింది. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి జయేశ్‌రంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా పాల్గొన్నారు.
జూబ్లీ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు గేట్, ముగ్ధా జంక్షన్, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పరిసరాలతో పాటు ఇతర ప్రధాన కూడళ్ల వద్ద ప్రతిపాదించిన స్టీల్ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల నిర్మాణాలను రద్దు చేయాలని స్థాయీ సంఘం నిర్ణయించింది. ఆయా పనుల కోసం కేఎన్ఆర్, మేఘా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసేందుకు కూడా ఆమోదం తెలిపింది.
వన్‌వే విధానంతోనే ట్రాఫిక్ రద్దీ గణనీయంగా మెరుగుపడటంతో కేబీఆర్ పార్కు చుట్టూ భారీ నిర్మాణాలు చేపట్టాలన్న పాత ప్రణాళికకు ప్రభుత్వం తెరదించింది.
