పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి సంకల్పమని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. చంద్రబాబు సంకల్ప బలం గొప్పదని ప్రశంసించారు. ఆదివారం తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబుతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించనున్న మూడు లక్షల ఇళ్లకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపే మరో మూడు లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపట్టడం దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని అన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ‘షైనింగ్ స్టేట్’గా మారే దశ ప్రారంభమైందని చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే సామర్థ్యం చంద్రబాబుకే ఉందన్నారు. ‘స్వర్ణాంధ్ర’పై ఆయనకున్న విజన్ గొప్పదని కొనియాడారు. ఒక పనిని సంకల్పిస్తే అది పూర్తయ్యే వరకు చంద్రబాబు విశ్రమించరని అన్నారు.
చంద్రబాబు నేడు ఆలోచించేది రేపు దేశం ఆచరిస్తుందని చౌహాన్ వ్యాఖ్యానించారు. ఆయన దూరదృష్టితో ఏపీ సాంకేతిక రంగంలో వేగంగా దూసుకెళ్తోందని తెలిపారు. ఏఐ డేటా సెంటర్లు, క్వాంటమ్ టెక్నాలజీ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు విజన్‌కు నిదర్శనమన్నారు. భవిష్యత్తులో దేశానికి ఏపీ దిక్సూచిగా మారబోతోందని చెప్పారు.
రాజధాని అమరావతిని చూసి తాను ఆశ్చర్యపోయానని చౌహాన్ అన్నారు. చంద్రబాబు ఆలోచనలతో అమరావతి ప్రపంచస్థాయి ఐకాన్‌గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు కూడా చంద్రబాబు నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.
తెనాలి ప్రతిభకు మారుపేరని చౌహాన్ అన్నారు. తాను మధ్యప్రదేశ్‌కే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు కూడా మామయ్యనేనంటూ చమత్కరించారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పేదల సొంతింటి కలను వైఎస్ జగన్ చెరిపేశారని ఆరోపించారు. జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలు గమనించారని చౌహాన్ అన్నారు.