గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 3 లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమంతో పాటు అత్యాధునిక 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ సాంకేతికతతో చేపట్టనున్న పైలట్‌ ప్రాజెక్టుకు గుంటూరు జిల్లాలో శంకుస్థాపన జరిగింది.

తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో తొలిసారిగా 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి మొత్తం 175 ఇళ్లను నిర్మించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం, సీఎస్‌ఐఆర్‌–సీబీఆర్‌ఐ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో ఈ పైలట్‌ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. సాధారణ నిర్మాణ పద్ధతులతో పోలిస్తే 3డీ ప్రింటింగ్‌ సాంకేతికత ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని ఎంత వేగంగా, సమర్థంగా పూర్తి చేయవచ్చో ఈ ప్రాజెక్టు ద్వారా అంచనా వేయనున్నారు.

ప్రత్యేక సాంకేతికతతో ఇళ్ల నిర్మాణం

3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ విధానంలో ప్రత్యేక యంత్రాల సహాయంతో ముందుగా నిర్దేశించిన డిజైన్‌ ప్రకారం కాంక్రీట్‌ పొరలను వరుసగా అమర్చి నిర్మాణాన్ని చేపడతారు. ఈ విధానం ద్వారా నిర్మాణంలో సాంకేతికత వినియోగాన్ని పెంచడంతో పాటు భవిష్యత్తులో భారీ స్థాయిలో గృహ నిర్మాణ కార్యక్రమాలకు ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో పరిశీలించనున్నారు.

3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక

ఇదే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 3 లక్షల ఇళ్ల నిర్మాణంపైనా దృష్టి సారించారు. రాష్ట్రంలోని అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇళ్లు అందించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు.

కార్యక్రమానికి ముందు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

By Ramya