నగరంలో రూ.2.8 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
16వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి రూ.12 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోతే ఈ నిధులు అందే అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ఎన్నికలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
గతంలో 23 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగకుండా వైసీపీ అడ్డంకులు సృష్టించిందని మంత్రి నారాయణ విమర్శించారు. దీంతో ఆయా మున్సిపాలిటీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని మంత్రి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అక్రమ కేసులు పెట్టి బెదిరించే ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు బాగా తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు సంతోషంగా ఉన్నారని అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆర్థిక సంఘం నిధులు అందడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.