• ప్రపంచ జంతు దినోత్సవం-2026 సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకున్నారు. ‘మనం ప్రపంచాన్ని వాటి కళ్లతో చూడగలిగితే ఏ పనులు భిన్నంగా చేస్తాం?’ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు.
  • ‘ప్రపంచాన్ని వాటి కళ్లతో చూడండి’ అనే ఈ ఏడాది ఇతివృత్తం మన దృక్కోణాన్ని దాటి ఆలోచించాలని అడవి, పెంపుడు జంతువులతో సహా ప్రతి జీవి అవసరాలు సంక్షేమం, గౌరవాన్ని గుర్తించాలని సూచిస్తోందని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. మనం ఈ రోజు తీసుకునే నిర్ణయాలే జంతువులు జీవించే ప్రపంచాన్ని రూపుదిద్దుతాయని తెలిపారు.
  • జంతువుల ఆవాసాలను రక్షించడం వాటిపై క్రూరత్వాన్ని అరికట్టడం వాటి పట్ల బాధ్యతతో వ్యవహరించడం ప్రతి జీవి పట్ల మనకున్న ఉమ్మడి బాధ్యతకు నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, తిరుపతి జంతు ప్రదర్శనశాలలు, జంతు దత్తత కార్యక్రమాల ద్వారా ప్రజలు జంతు సంరక్షణ, పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని చెప్పారు.
  • పుట్టినరోజు వివాహ వార్షికోత్సవం లేదా ఇతర కుటుంబ వేడుకలను మరో జీవి పట్ల మన ప్రేమ శ్రద్ధను చాటే సందర్భాలుగా మార్చుకుంటే వాటికి మరింత అర్థం చేకూరుతుందని పవన్‌కల్యాణ్‌ అన్నారు.
  • మన వేడుకలు కరుణ, బాధ్యత అనే వారసత్వాన్ని మిగిల్చాలని ఆకాంక్షించారు. ‘తమ గురించి తాము మాట్లాడుకోలేని జీవుల తరఫున మన నిర్ణయాలే మాట్లాడాలి. ప్రపంచాన్ని వాటి కళ్లతో చూడండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

By Rajini