బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే దేశంలో శాంతి కనిపించడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శలు వ్యక్తం చేశారు. దీంతో తాజాగా సంజయ్ దత్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను మాట్లాడిన మాటలు ముందుగా సిద్ధం చేసిన సంభాషణలో భాగమేనని, ఎవరినీ బాధపెట్టడం లేదా అవమానించడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

‘మున్నాభాయ్’ తరహాలో చెప్పాలనుకున్నా..

తన వ్యాఖ్యలు పూర్తిగా స్క్రిప్టెడ్‌గా రూపొందించిన కార్యక్రమంలో భాగమని సంజయ్ దత్ తెలిపారు. వాటిని సరదాగా, హాస్యభరితంగా చెప్పేలా సిద్ధం చేశారని వివరించారు. ‘మున్నాభాయ్’ సినిమాలో తన పాత్ర తరహాలో మాట్లాడాలని భావించానని, ప్రేమ, ఆప్యాయత, ఐక్యత, సోదరభావం వంటి సందేశాలను ప్రజలకు అందించడమే తన ఉద్దేశమని చెప్పారు.

అయితే తన మాటలను కొందరు మరో విధంగా అర్థం చేసుకున్నారని, అది దురదృష్టకరమని సంజయ్ దత్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వెనుక ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

అసలు ఏం జరిగిందంటే?

గాంధీ జయంతి సందర్భంగా ప్రసారమైన ఓ కార్యక్రమంలో దేశంలో ప్రస్తుత పరిస్థితులపై సంజయ్ దత్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా భారతీయుల మంచితనం, ఆతిథ్య గుణాలను ప్రశంసించిన ఆయన.. దేశంలో గతంలో ఉన్న శాంతి ఇప్పుడు తనకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. దేశంలో మళ్లీ అలాంటి ప్రశాంత వాతావరణం రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇదే కార్యక్రమంలో తనకు ఐదు నిమిషాల పాటు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తారనే ప్రశ్న కూడా ఎదురైంది. దీనికి తన ఫేమస్ ‘మున్నాభాయ్’ పాత్రను గుర్తు చేసేలా సరదాగా సమాధానం ఇచ్చారు.

నాలుగో కోతి వ్యాఖ్యలు వైరల్

మహాత్మా గాంధీ, ఆయన మూడు కోతుల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన సంజయ్ దత్.. తప్పును చూస్తే దాన్ని సరిదిద్దేందుకు మరో ‘నాలుగో కోతి’ కూడా అవసరమని చమత్కరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజా వివరణతో తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని సంజయ్ దత్ స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ప్రేమ, ఐక్యత, సోదరభావమే తన సందేశమని పేర్కొన్నారు.