ప్రభుత్వ నాయకత్వంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన మోదీ ప్రస్థానం దేశ ప్రధానిగా కొనసాగుతున్న స్థాయికి చేరుకోవడం ప్రజాసేవకు నిదర్శనమన్నారు.
ప్రజల విశ్వాసం, క్రమశిక్షణ, దేశాభివృద్ధి పట్ల నిబద్ధతే మోదీ నాయకత్వానికి ప్రధాన బలమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు అన్నదాతల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. జన్‌ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ వంటి కార్యక్రమాలతో సంక్షేమ పథకాల ప్రయోజనాలను సామాన్యులకు చేరువ చేశారని చెప్పారు.
పేదల అభ్యున్నతి, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి అన్నారు. మౌలిక వసతులు, స్వదేశీ ఉత్పత్తులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రోత్సాహం అందించారని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ఠను పెంచడంలో మోదీ నాయకత్వం కీలకంగా నిలిచిందన్నారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే మోదీ సంకల్పం స్ఫూర్తిదాయకమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో ఏళ్లు దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు. మరోవైపు, ప్రభుత్వ నాయకత్వంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ప్రజా సేవను జీవిత ధ్యేయంగా చేసుకుని నిబద్ధత, క్రమశిక్షణతో దేశ సేవలో ముందుకు సాగుతున్న మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి, ప్రగతి దిశగా ముందుకు సాగుతోందని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. దేశ అభివృద్ధితో పాటు భారత కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని తెలిపారు.