
ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. మంగళగిరి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనుల్ని వేగవంతం చేశారు. ఈ ఏడాదిలోనే పనులు పూర్తిచేసి ప్రారంభించాలని భావిస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో , దలకూ ఖరీదైన వైద్యం అందేలా, కార్పొరేట్‌కు దీటుగా ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం.. మంగళగిరిలో ఏకంగా 100 పడకల ఆస్పత్రి సిద్ధమవుతోంది. 2025 ఏప్రిల్ నెలలో మంత్రి లోకేష్ ఈ ఆస్పత్రి భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.52.20 కోట్ల వ్యయంతో, జీ+1 పద్ధతిలో, 1.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నేషనల్ హైవే 16 పక్కన గుంటూరుకు వెళ్లే మార్గంలో నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ఈ ఏడాదిలో ప్రారంభించాలని భావిస్తున్నారు. మంగళగిరిలోని ఈ కొత్త ఆస్పత్రిని దేశంలోనే రోల్ మోడల్‌గా నిర్మించి ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని గతంలో మంత్రి లోకేష్ అన్నారు. అందుకు తగిన విధంగానే రూపుదిద్దుకుంటోంది.
మంగళగిరిలో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. అప్పటి ఆ ఆస్పత్రి నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు తగిన విధంగా లేదు. అలాగే ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఈ 30 పడకల ఆస్పత్రి భవనం కూడా కూలిపోయే స్థితికి చేరుకుంది.. కేవలం ఓపీ సేవలు మాత్రమే అందిస్తున్నారు. దీంతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు విజయవాడ, గుంటూలోని జీజీహెచ్‌లకు వెళుతున్నారు. మంగళగిరిలో కొత్తగా ఆస్పత్రి నిర్మాణం చేస్తే బావుంటుందని గతంలోనే ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధుల్ని కలిసి ఆస్పత్రి నిర్మించాలని కోరారు.. అయినా ఫలితం లేకుండా పోయింది.
2024 ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి విజయం సాధించారు. ప్రజలకు ఇచ్చిన హామీ, దశాబ్దాల కలగా ఉన్న ఆస్పత్రి నిర్మాణం దిశగా అడుగులు వేశారు. నియోజకవర్గంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త ఆస్పత్రి నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. యార్లగడ్డ వెంకన్నచౌదరి మెడికల్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు కేటాయించిన పదెకరాల్లో ఈ ఆస్పత్రి నిర్మాణం కొనసాగుతోంది. అక్కడ ఉన్న క్యాన్సర్ ఆసుపత్రి భవనం శిథిలావస్థలో కూలిపోయే దశలో ఉండటంతో పూర్తిగా తొలగించారు.

