ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి నోరు విప్పిన దోవల్..! పాక్‌కు దిమ్మతిరిగే వార్నింగ్!

ఆపరేషన్ సింధూర్‌ తర్వాత తొలిసారి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ సహనం, ఉదారతను బలహీనతగా భావించవద్దని, అవసరమైతే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. శత్రువుపై గట్టిగా దెబ్బకొట్టగల సామర్థ్యం భారత్‌కు ఉందని పేర్కొన్నారు.

డిస్కవరీ రూపొందించిన ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సింధూర్’ డాక్యుమెంటరీలో దోవల్ ఈ విషయాలను వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్‌ ప్రధాన లక్ష్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమేనని తెలిపారు.

2025 ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్‌ ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించి, పాకిస్థాన్‌, పీఓకేలోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, మే 10న కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది.

రెండు భాగాలుగా రూపొందిన ఈ డాక్యుమెంటరీలో ఆపరేషన్ వెనుక జరిగిన నిర్ణయ ప్రక్రియ, వ్యూహాలు, కీలక పరిణామాలను దోవల్‌తో పాటు భారత భద్రతా వ్యవస్థకు చెందిన అధికారులు వివరించనున్నారు.

By Ramya