
టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. విమానాన్ని హైజాక్ చేసి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే ఆలోచన కో-పైలట్ హమామ్ అల్-హమామీకి ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఈ దాడికి సంబంధించిన ప్రణాళికను జూలైలోనే అమలు చేయాలని భావించినప్పటికీ.. చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. అనంతరం తాజాగా జరిగిన ఘటనలో అదే ప్రణాళికను అమలు చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
ఎయిర్‌పోర్ట్‌ను లక్ష్యంగా చేసుకోవాలనే ప్లాన్?
దర్యాప్తు వివరాల ప్రకారం.. విమానం బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సాధారణ ల్యాండింగ్ ప్రక్రియను కొనసాగిస్తూ, చివరి దశలో విమానాన్ని లక్ష్యాలపైకి మళ్లించాలనే ఉద్దేశం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. విమానాశ్రయంలోని లక్ష్యాలు సాధ్యం కాకపోతే ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా ఉన్నట్లు కథనాలు పేర్కొన్నాయి.
కాక్‌పిట్‌లో దాడి.. భారీ ప్రమాదం తప్పింది
విమానం ఇజ్రాయెల్‌కు చేరువవుతున్న సమయంలో కో-పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం విమానం నియంత్రణలో తీవ్ర అంతరాయం ఏర్పడి, కొద్ది సమయంలోనే భారీగా ఎత్తు కోల్పోయింది.
తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్చర్ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్లు కథనాలు చెబుతున్నాయి. ఆయన డిస్ట్రెస్ సిగ్నల్ పంపడంతో పాటు కాక్‌పిట్ తలుపులు తెరవడంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి చేరుకుని కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఆ సమయంలో విమానంలో ఉన్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు పరిస్థితిని చక్కదిద్దేందుకు సహకరించగా.. చివరకు విమానం సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు కథనాలు వెల్లడించాయి. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
