
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా.. తాజాగా మరో కీలక అప్‌డేట్ వెలువడింది. ఓఆర్‌ఆర్‌లోకి వాహనాల రాకపోకలకు వీలుగా మొత్తం 17 ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 8 డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్‌లు, ఒక సింగిల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్, 8 రోటరీ ఇంటర్‌ఛేంజ్‌లు ఉన్నాయి.
మొత్తం ఆరు వరుసలతో, యాక్సెస్ కంట్రోల్డ్ విధానంలో అమరావతి ఓఆర్‌ఆర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతి ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు, ప్రధాన రహదారులకు వేగవంతమైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.
అమరావతి ఓఆర్ఆర్ పనులకు వేగం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టెండర్లు పిలిచింది. మొత్తం 189.93 కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్ నిర్మించనుండగా.. నారా కోడూరు నుంచి బుడంపాడు వరకు 5.2 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల స్పర్ రోడ్డును కూడా నిర్మించనున్నారు. దీంతో మొత్తం రహదారి పొడవు 195.13 కిలోమీటర్లకు చేరనుంది.
అమరావతి ఓఆర్ఆర్‌పై మొత్తం 17 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా వాహనదారులు ఓఆర్ఆర్‌లోకి ప్రవేశించడంతో పాటు బయటకు వెళ్లేందుకు వీలు కల్పిస్తారు.
ఈ ఓఆర్ఆర్ ఆరు ప్రాంతాల్లో నేషనల్ హైవేలను క్రాస్ చేయనుంది. ఆయా ప్రాంతాల్లో ఎనిమిది డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్‌లను నిర్మించనున్నారు. అలాగే స్టేట్ హైవేలు, జిల్లా ప్రధాన రహదారులు క్రాస్ చేసే ప్రాంతాల్లో సింగిల్ ఇంటర్‌ఛేంజ్‌లు, రోటరీ ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే అమరావతి చుట్టూ వేగవంతమైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో పాటు రాజధాని ప్రాంతంలోని ప్రధాన రహదారులకు మెరుగైన అనుసంధానం ఏర్పడే అవకాశం ఉంది.
అమరావతి ఓఆర్ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు.. రూ.30,491 కోట్లకు ప్రాజెక్ట్ వ్యయం
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత 19 ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ.. ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించే ఉద్దేశంతో వాటి సంఖ్యను 17కు పరిమితం చేశారు. అలాగే ఓఆర్ఆర్ లోపలి వైపు మాత్రమే సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బయటివైపు సర్వీస్ రోడ్ల ప్రతిపాదనలను తొలగించారు.
గతంలో తెనాలి నుంచి జాతీయ రహదారిపై కాజ వరకు ప్రతిపాదించిన రహదారిని కూడా ప్రాజెక్టు నుంచి పక్కన పెట్టారు. దీంతో ఆ మార్గంలో ప్రతిపాదించిన రెండు ఇంటర్‌ఛేంజ్‌లను రద్దు చేశారు. ఈ మార్పులతో ఓఆర్ఆర్‌లో మొత్తం 17 ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేస్తూ.. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.30,491 కోట్లకు తగ్గించారు.
ఎక్కడెక్కడ ఇంటర్‌ఛేంజ్‌లు?
1. కంచికచర్ల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కంచికచర్ల సమీపంలో తొలి ఇంటర్‌ఛేంజ్‌ను డబుల్ ట్రంపెట్ విధానంలో నిర్మించనున్నారు.
2. పొన్నవరం: కంచికచర్ల–మధిర రాష్ట్ర రహదారిని ఓఆర్ఆర్ క్రాస్ చేసే ప్రాంతంలో, పొన్నవరం సమీపంలో రెండో ఇంటర్‌ఛేంజ్‌ను రోటరీ విధానంలో ఏర్పాటు చేయనున్నారు.
3. దుగ్గిరాలపాడు: విజయవాడ–ఖమ్మం–నాగ్‌పూర్ జాతీయ రహదారి (163జీ)ని ఓఆర్ఆర్ క్రాస్ చేసే చోట, దుగ్గిరాలపాడు సమీపంలో మూడో ఇంటర్‌ఛేంజ్‌ను డబుల్ ట్రంపెట్ విధానంలో నిర్మిస్తారు.
4. మైలవరం: మైలవరం సమీపంలో ఓఆర్ఆర్‌లోని 31.29వ కిలోమీటర్ వద్ద నాలుగో ఇంటర్‌ఛేంజ్‌ను డబుల్ ట్రంపెట్ విధానంలో ఏర్పాటు చేయనున్నారు.
5. అడవినెక్కలం: అడవినెక్కలం–వెల్వడం రహదారిని ఓఆర్ఆర్ క్రాస్ చేసే ప్రాంతంలో ఐదో ఇంటర్‌ఛేంజ్‌ను రోటరీ విధానంలో నిర్మిస్తారు.
6. ఆగిరిపల్లి: ఆగిరిపల్లి సమీపంలో ఆరో ఇంటర్‌ఛేంజ్‌ను డబుల్ ట్రంపెట్ విధానంలో ఏర్పాటు చేయనున్నారు.
7. పొట్టిపాడు: చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై పొట్టిపాడు సమీపంలో ఏడో ఇంటర్‌ఛేంజ్‌ను డబుల్ ట్రంపెట్ విధానంలో నిర్మించనున్నారు.
8. నున్నవరం: నున్నవరం–పుట్టగుంట రహదారిని ఓఆర్ఆర్ క్రాస్ చేసే ప్రాంతంలో ఎనిమిదో ఇంటర్‌ఛేంజ్‌ను రోటరీ విధానంలో ఏర్పాటు చేయనున్నారు.
ఇలా ఓఆర్ఆర్‌ను ప్రధాన జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులతో అనుసంధానించేలా ఇంటర్‌ఛేంజ్‌లను డిజైన్ చేశారు. వీటి ద్వారా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఓఆర్ఆర్‌పైకి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి
