ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 12 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (APHIMS) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రూ.20.62 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును 72 నెలల పాటు అమలు చేయనున్నారు. సేవలో ఉండగానే మృతి చెందిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి ఏడాది సేవకు రూ.5 వేల చొప్పున, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ ఇవ్వాలని నిర్ణయించింది.
రేపల్లె 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.58.42 కోట్లు కేటాయించడంతో పాటు అదనంగా 66 పోస్టుల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘తల్లికి వందనం’ పథకం మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు కేబినెట్ రాటిఫికేషన్ ఇచ్చింది.
సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ ఛార్జీల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులకూ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. IIT-JEE, NEET పరీక్షలకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించే కేంద్రం ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది.
కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారుల అతిథి గృహం ఏర్పాటుకు 1.69 ఎకరాల భూమి వర్గీకరణ మార్పునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ పోరంబోకు భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులకు రాటిఫికేషన్ ఇచ్చింది. వైఎస్సార్ కడప జిల్లా పాతూరులో ఆలయ అభివృద్ధి కోసం 7.66 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవాదాయశాఖకు బదలాయించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.