
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల వేళ మేయర్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఖరారుపై ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. మిగిలిన అభ్యర్థులను శనివారం దశలవారీగా ఖరారు చేయాలని భావిస్తున్నారు.
రాష్ట్రంలో నాలుగు కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులతో పాటు 49 మున్సిపాలిటీలకు ఛైర్‌పర్సన్ అభ్యర్థులను టీడీపీ ప్రకటించాల్సి ఉంది. గుంటూరు, ఒంగోలు, మచిలీపట్నం, మంగళగిరి కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థుల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఐవీఆర్‌ఎస్ సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వార్డుల వారీగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించే బాధ్యతను జిల్లా నాయకత్వం చేపట్టింది.
ఈ మేరకు జిల్లాల్లో కూటమి నేతలు ఇప్పటికే ఉమ్మడి సమావేశాలు నిర్వహించారు. నామినేషన్ల దాఖలుకు ఆదివారమే చివరి తేదీ కావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి వెలువడనున్న ప్రకటనలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కొవ్వూరులో ఆసక్తికర రాజకీయ పరిణామాలు
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతుండగా వైసీపీలో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కొవ్వూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా టీడీపీ తరఫున కంటమణి విజయలక్ష్మి శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఇదిలా ఉండగా కొవ్వూరులో కొందరు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం. మరోవైపు, వైసీపీ తరఫున తొలుత మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన మన్నే పద్మ పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమె పేరును అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపకపోవడంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం పార్టీ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
వార్డు సభ్యులుగా పోటీ చేయాల్సిన కొందరు అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొవ్వూరులో వైసీపీ నాయకత్వం తదుపరి కార్యాచరణపై స్పష్టత రావాల్సి ఉంది. నామినేషన్లకు గడువు సమీపిస్తుండటంతో ఇక్కడి రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
