వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్థానం సంపాదించడంపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. రికార్డు సాధించిన విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంలో 170 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సుమారు 35 వేల మంది విద్యార్థులు కలిసి 75 వేల కిలోల పొడి చెత్తను సేకరించడం ద్వారా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారని మంత్రి తెలిపారు.

విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రత శ్రమదానం పట్ల అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు లోకేశ్ పేర్కొన్నారు. విద్యార్థులు, పాఠశాలలు, ప్రజలు సమష్టిగా ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టి విజయవంతం చేశారని అన్నారు.

ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ స్పృహను పెంపొందిస్తాయని పేర్కొన్న మంత్రి ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.

By Rajini