
ఫ్రీలాన్సర్లు ITR దాఖలు చేసేటప్పుడు ఇవి తప్పక తెలుసుకోండి
ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ ఆదాయం పొందుతున్నవారు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ను గడువులోగా దాఖలు చేయడం చాలా ముఖ్యం. అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27కు సంబంధించి ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని ఫ్రీలాన్సర్లు ఆగస్టు 31లోగా ITR దాఖలు చేయాలి. ట్యాక్స్ ఆడిట్ వర్తించే వారికి అక్టోబర్ 31 వరకు గడువు ఉంటుంది.
ఏ ITR ఫారం ఎంచుకోవాలి?
ఫ్రీలాన్సర్లు తమ ఆదాయం, అకౌంటింగ్ విధానాన్ని బట్టి సరైన ITR ఫారాన్ని ఎంచుకోవాలి. ఆదాయం, ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలతో అకౌంట్ బుక్స్ నిర్వహిస్తున్నవారు సాధారణంగా ITR-3ను దాఖలు చేయాలి.
అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 44ADA కింద ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ స్కీమ్‌ను ఎంచుకున్నవారు ITR-4 ద్వారా రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఈ విధానంలో పూర్తి స్థాయిలో అకౌంటింగ్ రికార్డులు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. నిర్దేశించిన నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకునే ఆదాయంపై పన్ను లెక్కిస్తారు.
రిటర్న్ దాఖలుకు ముందు ఇవి చెక్ చేసుకోండి
ఫ్రీలాన్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ITRలో వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చిన ఆదాయంగా చూపించాలి. రిటర్న్ సమర్పించే ముందు జారీ చేసిన ఇన్‌వాయిస్‌లు, అందుకున్న చెల్లింపులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఫారం 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), TDS సర్టిఫికెట్లు, అకౌంట్ బుక్స్ వంటి వివరాలను పరిశీలించాలి.
విదేశీ క్లయింట్ల నుంచి ఆదాయం పొందుతున్న ఫ్రీలాన్సర్లు.. తమ బ్యాంక్ ఖాతాలో జమ అయిన విదేశీ చెల్లింపుల వివరాలను కూడా సంబంధిత రికార్డులతో సరిపోల్చుకోవాలి. ఇలా ముందుగానే వివరాలను తనిఖీ చేసుకోవడం వల్ల ఆదాయపు పన్ను శాఖ రికార్డుల్లో ఉన్న సమాచారానికి, ITRలో పేర్కొన్న వివరాలకు మధ్య వ్యత్యాసాలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు.

