
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ విడుదల తేదీపై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పష్టత ఇచ్చారు. భారత్, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ చిత్రాన్ని వేర్వేరు తేదీల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్లలో సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదలవుతుంటాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 6న విదేశీ ప్రేక్షకుల ముందుకు ‘రామాయణ’ను తీసుకురానున్నట్లు నమిత్ మల్హోత్రా తెలిపారు. ఇక భారతదేశంలో పండుగ సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని దీపావళి రోజైన నవంబర్ 8న ప్రత్యేక వ్యూహంతో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కనిపించనున్నారు. ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. భారత్‌లో ధర్మ ప్రొడక్షన్స్ పంపిణీ బాధ్యతలు చేపట్టగా, ఓవర్సీస్ హక్కులను సోనీ పిక్చర్స్ దక్కించుకుంది. సంగీత హక్కులను టీ-సిరీస్ రూ.75 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
యశ్ ‘టాక్సిక్’పై భారీ అంచనాలు
ఇదిలా ఉంటే.. యశ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా యశ్ మునుపెన్నడూ కనిపించని సరికొత్త గెటప్, విభిన్నమైన పాత్రలో కనిపించనుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

