
దేశంలోని రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీల ప్రభావం కనిపించింది. తమిళనాడులో రెండు స్థానాల్లో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే విజయం సాధించగా, పుదుచ్చేరిలో సీఎం రంగసామికి చెందిన ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు, పశ్చిమ బెంగాల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యంగా నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి ఏకంగా 1.22 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజినగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా సీఎం సువేందు అధికారి సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి హాసి రాణి రథ్ తన సమీప ప్రత్యర్థిపై 1.2 లక్షలకు పైగా ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలు సాధించిన అభ్యర్థుల్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు.
ఈ విజయం వెనుక మరో ఆసక్తికరమైన అంశం ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు, మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో దారుణ హత్యకు గురైన సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్‌కు హాసి రాణి రథ్ తల్లి. దీంతో నందిగ్రామ్ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది.
సువేందు అధికారి నందిగ్రామ్, భవానీపూర్ రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హాసి రాణి రథ్‌కు 1,64,227 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు 41,674 ఓట్లు లభించాయి. ఫలితంగా హాసి రాణి రథ్ 1,22,553 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో నందిగ్రామ్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.
గతంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున పోటీ చేసిన సువేందు అధికారి 81,230 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పటివరకు అదే నందిగ్రామ్‌లో ఇదే అత్యధిక మెజార్టీగా ఉండేది. తాజాగా హాసి రాణి రథ్ ఆ రికార్డును అధిగమించారు.
నందిగ్రామ్ సువేందు అధికారి రాజకీయ ప్రస్థానంలో కీలకమైన నియోజకవర్గం. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన, 2016లో టీఎంసీ తరఫున తొలిసారి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం బీజేపీలో చేరిన సువేందు అధికారి.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచే మమతా బెనర్జీపై పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది.
పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నిక జరిగిన మరో నియోజకవర్గం రేజినగర్లోనూ బీజేపీ విజయాన్ని అందుకుంది. ఆ పార్టీ అభ్యర్థి శంకరవ్ సర్కార్ 75 వేలకుపైగా ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి విజయం సాధించిన ఏజీయూపీ వ్యవస్థాపకుడు హుమయూన్ కబీర్.. రేజినగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ ఎన్నికల్లో ఏజీయూపీ అభ్యర్థి గులామ్ నబీ అజాద్‌కు సుమారు 54 వేల ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థికి 6 వేల ఓట్లు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థికి కేవలం 3,800 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
మైనారిటీ ఓటర్లు సైతం పెద్ద సంఖ్యలో బీజేపీకి మద్దతు తెలిపారని సీఎం సువేందు అధికారి పేర్కొన్నారు. రేజినగర్ నియోజకవర్గంలో సుమారు 70 శాతం మంది ఓటర్లు మైనారిటీ వర్గాలకు చెందినవారు కాగా, నందిగ్రామ్‌లో వారి సంఖ్య 27 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ సాధించిన విజయాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
