
ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేందుకు కీలక ముందడుగు వేసింది. విజయవాడలోని పున్నమిఘాట్-భవానీ ఐలాండ్ మధ్య రాత్రి 10 గంటల వరకు బోటింగ్‌కు అనుమతించింది. జలవనరులశాఖ అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. బోటింగ్‌కు సంబంధించి కొన్ని సూచనలు చేస్తూనే.. కొన్ని నిబంధనలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోటింగ్‌కు వచ్చే పర్యాటకుల భద్రతకు సంబంధించిన బాధ్యత ఏపీటీడీసీదేనని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడలో పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, విజయవాడలో బోటింగ్‌కు జలవనరులశాఖ షరతులతో పరిమితమైన అనుమతించింది. మొత్తం 25 షరతులతో ఎన్వోసీ జారీ జారీ చేయగా.. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ వరకు ప్రతి రోజూ రాత్రి 10 గంటల వరకు బోటింగ్‌కు వెళ్లొచ్చు. ప్రకాశం బ్యారేజీ గేట్ల నిర్వహణ, నీటి విడుదలకు ప్రాధాన్యం ఉంటుందని జలవనరులశాఖ తెలిపింది. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఎదురైతే.. ఆ సమయంలో ముందస్తు సమాచారం లేకుండానే బోటింగ్ నిలిపివేసే అధికారం ఉంటుందని కూడా షరతుల్లో పేర్కొంది.
బోటింగ్‌కు వచ్చే పర్యాటకుల భద్రతకు సంబంధించిన బాధ్యత ఏపీటీడీసీదేనని తేల్చి చెప్పింది జలవనరులశాఖ. ఈ బోటింగ్ వల్ల మత్స్యకారుల హక్కులకు భంగం కలగకూడదని.. పర్యాటకులు నదిలో వ్యర్ధాలను వేయకుండా చూడాలని సూచించారు. ఈ బోటింగ్ కేవలం పున్నమిఘాట్-భవానీ ఐలాండ్ వరకు ఉంటుందని.. ఆ ప్రాంతాన్ని దాటి బోట్లు వెళ్లకూడదని సూచించారు. అలాగే బోటింగ్ కోసం అధికారికంగా గుర్తించిన జెట్టీలను మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. బోట్లు ప్రకాశం బ్యారేజీ వెయ్యి మీటర్ల ఎగురు పరిధిలోకి రాకూడదని కూడా జలవనరులశాఖ తెలిపింది. బోట్లలో మద్యం, ప్రమాదకర వస్తువులు, పేలుడు పదార్ధాలు కూడా అనుమతించరు. అవసరమైన సమయంలో జలవనరుల శాఖ తనిఖీలకు సహకరించాలని సూచించారు.
ఏపీటీడీసీ నుంచి బోటింగ్ కోసం అవసరమైన అన్నిరకాల చట్టబద్దమైన అనుమతుల్ని తీసుకోవాలని జలవనరులశాఖ సూచించింది. ప్రతి బోటుకు కృష్ణానది రివర్ కన్జర్వేటర్, ఈఈ నుంచి ప్రత్యేక అనుమతి కచ్చితంగా తీసుకోవాలని సూచించారు. పర్యాటకుల భద్రత కోసం బోటులో లైఫ్ జాకెట్లు, ఇతర పరికరాలు, శిక్షణ పొందిన ఈతగాళ్లు, సమాచారం చేరవేసేందుకు అవసరమైన కమ్యూనికేషన్ పరికరాలు, జీపీఎస్ అమర్చాలని కూడా పేర్కొన్నారు. బోటుకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, బీమా, తనిఖీ సహా ఇతర డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. గడువు ముగిసిన వాటిని బోట్లను నడపకూడదని.. అనుమతించిన బోటింగ్ మార్గంలో లైట్లతో స్పష్టంగా ఉండాలన్నారు. రాత్రి వేళలలో బోటింగ్‌కు వీలుగా అవసరమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.

