తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో పార్కింగ్‌ చేసిన అద్దె బస్సు చోరీ కావడం కలకలం రేపింది. విజయవాడ–తిరుపతి మార్గంలో నడిచే ఈ బస్సును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బస్సు యజమాని జీపీఎస్‌ సాయంతో ట్రాక్‌ చేయగా, అది నంద్యాల వైపు వెళ్తున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

తెల్లవారుజామున కనిపించని బస్సు

ఏపీ 39 యూఎక్స్‌ 9333 నంబరు గల గవర్నర్‌పేట బస్సు విజయవాడ నుంచి తిరుపతికి అద్దె ప్రాతిపదికన నడుస్తోంది. ఈ నెల 20వ తేదీ రాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్‌ నాగేశ్వరరావు బస్సును పార్కింగ్‌ చేసి, కండక్టర్‌తో కలిసి విశ్రాంతి గదికి వెళ్లారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో తిరిగి వచ్చి చూడగా బస్సు కనిపించలేదు.

దీంతో డ్రైవర్‌ ఆర్టీసీ అధికారులకు, బస్సు యజమానికి సమాచారం అందించారు. అనంతరం తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నంద్యాల జిల్లాలో బస్సు గుర్తింపు?

బస్సు జీపీఎస్‌ ఆధారంగా నంద్యాల వైపు వెళ్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, చాగలమర్రి పోలీసుల సహకారంతో మహారాష్ట్రకు చెందిన విష్ణు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, బస్సును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.

చోరీకి గురైన బస్సు విలువ సుమారు రూ.46 లక్షలు ఉంటుందని సమాచారం. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక కారణాలు, ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *