
వినుకొండ: తమ పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జేఏసీ–పల్నాడు, వినుకొండ టీమ్ ఆధ్వర్యంలో వినుకొండలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో నిరంతరం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, 100 శాతం గ్రాస్ జీతం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, పెయిడ్ మెడికల్ లీవ్స్, హెల్త్ కార్డుల మంజూరు, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్లకు అవకాశం కల్పించాలని కోరారు.
తమ డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
కాగా, కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తమ సంఘీభావం, మద్దతు కొనసాగుతుందని APNGOతో పాటు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ స్టేట్ వైస్ చైర్మన్ పి. శివరామకృష్ణ, జిల్లా చైర్మన్ నాగరాజు కుమారి, శాంతారాజు, జాయింట్ సెక్రటరీ కోటేశ్వర నాయక్, స్టేట్ కోఆర్డినేటర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
