స్వచ్ఛాంధ్ర సాధన ప్రభుత్వం ఒక్కటే చేయాల్సిన కార్యక్రమం కాదని, రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతోనే అది ప్రజా ఉద్యమంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత నుంచి ఇల్లు, పాఠశాల, కార్యాలయం, గ్రామం, పట్టణం వరకు ప్రతి స్థాయిలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛతా కార్యక్రమాలకు కేటాయించాలని సూచించారు.

స్వచ్ఛ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్‌స్టేషన్లు, రైతు బజార్లు, పరిశ్రమలు, స్వచ్ఛతపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, పారిశుధ్య కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లను స్వచ్ఛ అవార్డులతో సత్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇల్లు, పాఠశాల, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీకి పరిశుభ్రత ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని సూచించారు.

చెత్తను సమస్యగా చూడకుండా సంపదగా మార్చే విధానాన్ని అవలంబించాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఇంకా సుమారు 8 లక్షల టన్నుల చెత్తను తొలగించాల్సి ఉందని, జీరో గార్బేజ్‌ లక్ష్యాన్ని సాధించే వరకు అధికారులను నిరంతరం పర్యవేక్షిస్తానని చెప్పారు. రూప్‌టాప్‌ సోలార్‌ను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు.

స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలను అమలు చేయాలని సీఎం కోరారు. ప్రతి ఏడాది అక్టోబర్‌ 2న నెట్‌జీరో, స్వచ్ఛత రంగాల్లో కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందించే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అనంతరం స్వచ్ఛతా వారియర్లు, స్వచ్ఛతపై పనిచేస్తున్న ఎన్జీవోలు, స్వచ్ఛ కాలనీలు, అసోసియేషన్లు, వివిధ సంస్థలకు ‘స్వచ్ఛాంధ్ర-2026’ అవార్డులను ముఖ్యమంత్రి ప్రదానం చేశారు.

By Rajini