ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ అధికారులు ఆహ్వానించారు.

ఈ మేరకు మంగళవారం ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో యం. శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను దేవస్థానం అధికారులు చంద్రబాబుకు అందజేశారు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవస్థానం చేపడుతున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

By Rajini