ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రోత్సాహం పారిశ్రామిక అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన అధ్యక్షతన 22వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఇంధనం, పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల రంగాల్లోని వివిధ ప్రతిపాదనలపై అధికారులతో సీఎం చర్చించారు.

గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా వాటిని వాస్తవ పెట్టుబడులుగా మార్చి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మొత్తం 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టులకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

విశాఖలో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్

రాష్ట్రంలో భారీ పెట్టుబడుల సదస్సులను నిర్వహించేందుకు వీలుగా విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.

రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలి

రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యానవన పంటల కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రంగాల్లో సమన్వయంతో ముందుకెళ్లి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

లాజిస్టిక్స్, సెమీకండక్టర్ రంగాలపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేసే క్రమంలో పోర్టులు, విమానాశ్రయాలతో పాటు తూర్పు-పశ్చిమ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయాలని సీఎం సూచించారు. రవాణా, సరకు రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలని తెలిపారు.

అలాగే సెమీకండక్టర్ రంగంలో తయారీ యూనిట్లతో కూడిన సమగ్ర పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అనుబంధ పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

వర్చువల్‌గా పాల్గొన్న మంత్రులు

ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయణ, కందుల దుర్గేశ్ వర్చువల్‌గా హాజరయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయడం ఒప్పందాలను కార్యరూపంలోకి తీసుకురావడం వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *