ఉరవకొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామస్థాయిలో చోటుచేసుకున్న మార్పులను వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని ఆర్థిక మంత్రి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. నియోజకవర్గంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఉరవకొండలో తాగునీటి సదుపాయం కల్పించడం, హంద్రీనీవా కాలువను వెడల్పు చేయడం ద్వారా కలిగిన ప్రయోజనాలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, గ్రామాల్లో సిమెంట్ రోడ్ల ఏర్పాటు, నూతన భవనాల మంజూరు తదితర అంశాలను పుస్తకంలో పొందుపరిచినట్లు మంత్రి వివరించారు. నియోజకవర్గంలో వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిని సమగ్రంగా తెలియజేసే ఈ పుస్తకం ప్రజలకు ప్రోగ్రెస్ కార్డులా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పయ్యావుల కేశవ్‌ను అభినందించిన చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి పయ్యావుల కేశవ్‌ను అభినందించారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసానికి, కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించేలా ఇలాంటి నివేదికలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు.
నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు సూచించారు. అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు, వాటి పురోగతి, ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను కూడా ప్రజల ముందుంచాలని మంత్రి పయ్యావుల కేశవ్‌కు తెలిపారు.
అభివృద్ధికి సహకరించిన సీఎంకు కృతజ్ఞతలు
ఉరవకొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసి సహకరిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా ప్రభుత్వ పనితీరును పారదర్శకంగా వివరించవచ్చని మంత్రి పేర్కొన్నారు.