• ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచితే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వివిధ శాఖలు అందిస్తున్న పౌర సేవలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
  • ఈ సమావేశానికి రెవెన్యూ, ఐటీ, ఆర్థిక, మహిళా శిశు సంక్షేమం, స్కిల్ డెవలప్‌మెంట్, ఐ అండ్ ఐ, సెర్ప్ తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పౌరులకు అందుతున్న సేవలు, వాటి నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.
  • రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులతో త్వరలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. కెపాసిటీ బిల్డింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అన్ని ప్రభుత్వ శాఖలు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
  • ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, మిషన్ కర్మయోగి పోర్టల్, ఉన్నతి ద్వారా అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.
  • 4200 ఆన్‌లైన్ కోర్సులను పూర్తి చేసిన ఓ ఎస్జీటీ ఉపాధ్యాయుడి ఉదాహరణను సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా ఉద్యోగులు తమ సామర్థ్యాలను మరింత పెంచుకోవచ్చని అన్నారు.
  • ఆన్‌లైన్ కోర్సులతో పాటు ఆఫ్‌లైన్ శిక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ఐఐఎంలు, ఐఐటీలు, యూనివర్సిటీల సహకారంతో ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
  • ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాభివృద్ధి ద్వారా పాలనలో మరింత వేగం, నాణ్యత తీసుకురావడంతో పాటు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

By Rajini