
బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన తనను మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీయేనని ఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపిస్తామని మంత్రి తెలిపారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలయ్యేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. బీసీలకు మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ నేతలను మంత్రి ప్రశ్నించారు. గతంలో బీసీలకు కల్పించిన 23 శాతం రిజర్వేషన్లు సరిపోవని, 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీల రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
