
ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన సేవల హక్కు బిల్లుపై ప్రశంసలు కురిపించారు. ఈ బిల్లు చాలా బావుందుని.. ఏపీలో కూడా అమలు చేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఏపీలో సీఎస్ఆర్ నిధుల ఖర్చుకు సంబంధించిన అంశంపై కూడా విజయసాయిరెడ్డి తన అభిప్రాయాలను చెప్పారు.
రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. దేశవ్యాప్తంగా జరిగే పరిణామాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. ఆయా అంశాలపై తన అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలు, వివిధ అంశాలను తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తే బావుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ చట్టాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఢిల్లీ సిటిజెన్ టు టైమ్ బౌండ్ అండ్ ఈజ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ బిల్లు 2026ను ఇటీవల ఆమోదించారు. ఈ బిల్లును ఏపీలో కూడా అమలు చేస్తే బావుంటుందన్నారు.
ప్రతి దరఖాస్తును పర్యవేక్షిస్తూ, నిర్దిష్ట కాలవ్యవధిలోగా ప్రభుత్వ సేవలను పొందేందుకు పౌరులకు చట్టపరమైన హక్కును కల్పించేందుకు.. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన సేవల హక్కు బిల్లును అభినందిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైనది.. ఈ బిల్లు దిశగా కృషి చేయాలన్నారు.. ఇది పౌర కేంద్రీకృత పాలన. ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేయడానికి పరిగిణలోకి తీసుకోవాలి’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్ఆర్ నిధుల వినియోగంపై విజయసాయిరెడ్డి స్పందించారు. ‘2024-25 ఆర్థిక సంవత్సరంలో CSR (కార్పొరేట్ సామాజిక బాధ్యత) పై ఖర్చు చేసిన రూ.40,794 కోట్లలో.. ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.1,383 కోట్లు (3.3శాతం) మాత్రమే ఎందుకు అందాయి?. ఏపీ ప్రభుత్వం కంపెనీలకు అతి తక్కువ ధరలకు ఎకరాల కొద్ది భూమి కేటాయించింది.. ఈ భూముల ద్వారా కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆ కంపెనీలు కూడా మరింత CSR నిధులు కేటాయించకూడదా?’ అంటూ ప్రశ్నించారు.

