
స్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీలు.. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కూడా గాంధీ జయంతి రోజున ఈ అంశంపై ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
ముంబయిలోని శివాజీ పార్కులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అభిజీత్ దీప్కే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముంబయి పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూనే.. ఢిల్లీ డీసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ డీసీపీ తీరును బ్రిటిష్ జనరల్ డయ్యర్‌తో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శుక్రవారం ముంబయిలోని శివాజీ పార్కులో ‘జైల్ భరో’ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. జులైలో ఢిల్లీలో నిర్వహించిన సీజేపీ పార్లమెంట్ మార్చ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు, పోలీసుల తీరుతో పోలిస్తే ముంబయి పోలీసుల వ్యవహారశైలి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు.
ముంబయి పోలీసులను ప్రశంసించిన దీప్కే.. ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను బ్రిటిష్ జనరల్ డయ్యర్‌తో పోల్చుతూ విమర్శలు గుప్పించారు. ముంబయిలో తమకు ఎదురైన అనుభవాన్ని, జంతర్ మంతర్ వద్ద నిరసనల సందర్భంగా ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును పోల్చుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘నన్ను అదుపులోకి తీసుకోవాలని ముంబయి పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. అయినప్పటికీ వారు ఎంతో మంచిగా వ్యవహరించి, నాకు టీ ఆఫర్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అదే ఢిల్లీలో అయితే డీసీపీ సచిన్ శర్మ ఒక క్రూరుడిలా వ్యవహరిస్తారు. అమిత్ షాకు డీసీపీ సచిన్ శర్మ ‘జనరల్ డయ్యర్’ లాంటివారు’’ అని దీప్కే వ్యాఖ్యానించారు.
కాగా, భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో తీవ్ర విషాదంగా నిలిచిన జలియన్‌వాలాబాగ్ కాల్పుల ఘటనకు బ్రిటిష్ అధికారి జనరల్ రెజినాల్డ్ డయ్యర్ నాయకత్వం వహించారు. 1919లో అమృత్‌సర్‌లో జరిగిన ఈ ఘటనలో బ్రిటిష్ దళాలు నిరాయుధ ప్రజలపై కాల్పులు జరిపాయి.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ సీజేపీ కార్యకర్తలు, హక్కుల సంఘాల ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ముంబయిలోని శివాజీ పార్క్ వద్ద భారీగా చేరుకున్న నిరసనకారులతో ఆందోళన తీవ్రతరమైంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న భారీ నిరసన కార్యక్రమాలకు ముంబయి ఆందోళన నాంది మాత్రమేనని తెలిపారు.
