
పొందూరు (ఆమదాలవలస), కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు వారిని స్వయం సహాయక సంఘాల సభ్యులకే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
పొందూరులోని సాయిబాబా వీవర్స్ సొసైటీ నూతన భవనంలో డీఆర్డీఏ-సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఖాదీ క్లస్టర్లో భాగంగా మహిళలకు నిర్వహించనున్న ఉచిత చేనేత శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి ప్రారంభించారు. 20 మగ్గాలపై మహిళలకు చేనేత శిక్షణ అందించనున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా స్థానికంగానే స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఆధునిక పద్ధతుల్లో నాణ్యమైన చీరల తయారీపై శిక్షణ ఇవ్వడంతో పాటు పొందూరు ప్రసిద్ధ చేనేత సంప్రదాయాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేసి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామీణ ప్రాంత మహిళలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు.
మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందుబాటులోకి రావడంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన డ్వాక్రా వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందడంతో పాటు కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
