ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక బీపీసీఎల్‌ (BPCL) ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏటా 9 నుంచి 12 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రిఫైనరీని ఏర్పాటు చేయనున్నారు.

ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి 2030 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ స్థాయిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి పారిశ్రామికంగా మరింత ఊతం లభించడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు అందనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీపీసీఎల్‌ (భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌కు కేంద్ర ప్రభుత్వం కీలకమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ, కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) అనుమతులకు కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది.

అనుమతులు మంజూరు కావడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న బీపీసీఎల్‌ ప్రాజెక్టుకు భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.96,862 కోట్ల పెట్టుబడి పెట్టేలా బీపీసీఎల్‌ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అనంతరం రిఫైనరీతో పాటు పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో మొత్తం పెట్టుబడి దాదాపు రూ.1.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

ఐదేళ్లలో ఈ పెట్టుబడులను దశలవారీగా వెచ్చించాలని బీపీసీఎల్‌ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పర్యావరణ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజాగా అనుమతులు లభించడంతో శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కావలి, గుడ్లూరు మండలాల పరిధిలో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఏడాదికి 9 మిలియన్‌ టన్నుల ముడిచమురు శుద్ధి చేసే సామర్థ్యంతో రిఫైనరీని నిర్మించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ దశలో సుమారు 14 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రిఫైనరీ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 1,250 మందికి ప్రత్యక్షంగా, మరో 3,750 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అంచనా.

ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఈ సందర్భంగా బీపీసీఎల్‌ సమర్పించిన వివరాలను కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ పరిశీలించి, పర్యావరణ అనుమతుల ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంది.