
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి విమర్శలు గుప్పించారు. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. బుధవారం నగరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
రాయలసీమ అభివృద్ధి విషయంలో చంద్రబాబు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని రోజా విమర్శించారు. ఇప్పటివరకు రాయలసీమకు రూ.24 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, అయితే ఆ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయో స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు పొంతన లేదని ఆరోపించారు.
రాయలసీమపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని రోజా కోరారు. కేవలం ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టకుండా, అభివృద్ధి పనుల పురోగతిని ప్రజల ముందుంచాలని సూచించారు.
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని విమర్శించిన రోజా.. ‘కరువు, చంద్రబాబు కవల పిల్లలు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘రైజింగ్ రాయలసీమ’ పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుప్పం, పిఠాపురం ప్రాంతాలకు కూడా నీటిని అందించలేని వారు రాయలసీమ అభివృద్ధి గురించి గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
రాయలసీమ అభివృద్ధిపై మాటలకు పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులు, సాధించిన పురోగతిని ప్రజలకు వివరించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు.
