ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గమ్మ దర్శనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విజయవాడకు తరలివస్తున్నారు. మరోవైపు దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ 2.0, జాతీయ సరస్ మేళా కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు మరింత పటిష్టం చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం పోలీస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ మోడల్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి అక్కడి నుంచి కొనసాగుతున్న పర్యవేక్షణను పరిశీలించారు. కంట్రోల్ రూమ్ పనితీరు భక్తుల భద్రత కోసం తీసుకున్న చర్యలను పోలీస్ అధికారులు మంత్రికి వివరించారు.
ఏఐ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా
దసరా ఉత్సవాలకు వచ్చే భక్తుల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 30 అధునాతన డ్యాష్‌బోర్డుల ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
భక్తుల రద్దీని అంచనా వేసేందుకు ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలోని క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.
నగరంలో 40 పార్కింగ్ పాయింట్లు
భక్తులకు రవాణా, పార్కింగ్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా విజయవాడ నగరవ్యాప్తంగా 40 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు హోంమంత్రి అనితకు వివరించారు.
రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట తగిన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ సమీక్షలో డీసీపీలు షీరీన్ బేగం, కేజీవీ సరిత, కృష్ణ ప్రసన్న తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.