హైదరాబాద్‌ మెట్రోరైలు 2026 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.405.86 కోట్ల నష్టాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.380.46 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఈసారి మెట్రో ఆదాయం రూ.524.78 కోట్లకు పెరిగినప్పటికీ, మొత్తం వ్యయాలు రూ.930.64 కోట్లకు చేరడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఇందులో రుణాలపై వడ్డీ చెల్లింపులకే రూ.522.61 కోట్లు ఖర్చు కావడం గమనార్హం. మెట్రోను స్వాధీనం చేసుకున్న అనంతరం రుణాలను రీషెడ్యూల్‌ చేయడం, వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించి నష్టాలను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

హైదరాబాద్‌ మెట్రోరైలు ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. తొలి దశ మెట్రో ప్రాజెక్టును ఎల్‌ అండ్‌ టీ నుంచి స్వాధీనం చేసుకుని, ఆర్థికంగా గాడిలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. స్వాధీన ప్రక్రియలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు, మెట్రో ఆదాయం కొంత పెరిగినప్పటికీ నిర్వహణ ఖర్చులు భారీగా ఉండటంతో నష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

2026 సెప్టెంబరు 30తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు రూ.405.86 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ నష్టాలు రూ.380.46 కోట్లుగా ఉన్నాయి. అంటే ఏడాది వ్యవధిలో అర్ధవార్షిక నష్టాలు మరో రూ.25.40 కోట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో మెట్రో నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టాలన్న ప్రతిపాదనలో ఆర్థిక అంశాలు కీలకంగా మారాయి. ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం, రుణభారాన్ని తగ్గించడం, ఆదాయానికి అనుగుణంగా వ్యయాలను నియంత్రించడం వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.

ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో హైదరాబాద్‌ మెట్రోరైలుకు కార్యకలాపాలు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా రూ.524.78 కోట్ల ఆదాయం లభించింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.497.54 కోట్లతో పోలిస్తే ఆదాయం రూ.27.24 కోట్లు పెరిగింది. ప్రయాణికుల రవాణా, ఇతర కార్యకలాపాల ద్వారా ఆదాయం పెరుగుతున్నప్పటికీ, పెరుగుతున్న ఖర్చులను భరించేందుకు ఈ మొత్తం సరిపోవడం లేదు. మెట్రో నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పరిపాలనా వ్యయాలు, నిర్మాణ సంబంధిత ఖర్చులు, రుణాలపై వడ్డీలు, తరుగుదల కలిపి ప్రస్తుత అర్ధ సంవత్సరంలో మొత్తం వ్యయాలు రూ.930.64 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ వ్యయాలు రూ.878 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో ఆదాయానికి, ఖర్చులకు మధ్య వ్యత్యాసం మరింత పెరిగింది.

మెట్రోపై వడ్డీల భారం

హైదరాబాద్‌ మెట్రోరైలు ఆర్థిక పరిస్థితిపై రుణాల వడ్డీ భారం తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఫైనాన్స్‌ ఖర్చులు రూ.522.61 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో మెట్రో రైళ్ల నిర్వహణకు రూ.222.88 కోట్లు ఖర్చయ్యాయి. మెట్రోకు సమకూరుతున్న ఆదాయంలో గణనీయమైన భాగం రుణాలపై వడ్డీల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా ఆదాయం పెరుగుతున్నప్పటికీ, అధిక వడ్డీ భారం, నిర్వహణ వ్యయాల కారణంగా సంస్థ ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మెరుగుదల కనిపించడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రుణభారాన్ని తగ్గించడం, వ్యయాలను నియంత్రించడం మెట్రోకు కీలకంగా మారాయి.

హైదరాబాద్‌ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలపై ఎల్‌ అండ్‌ టీ మెట్రో సంస్థ ప్రస్తుతం సగటున 7 నుంచి 8 శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీ భారాన్ని తగ్గించేందుకు మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా రుణాలను పునర్వ్యవస్థీకరించాలని యోచిస్తోంది. వడ్డీ రేట్లను 3.5 నుంచి 4 శాతం లోపునకు తీసుకురాగలిగితే మెట్రో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు ముందుకొచ్చే బ్యాంకులను గుర్తించే బాధ్యతను ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించింది.

రోజుకు రూ.2.85 కోట్ల వడ్డీ భారం

ప్రస్తుత అర్ధవార్షిక ఆర్థిక గణాంకాల ప్రకారం, హైదరాబాద్‌ మెట్రోపై రుణాల వడ్డీ భారం రోజుకు సగటున సుమారు రూ.2.85 కోట్లుగా ఉంది. ఈ భారాన్ని తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను పెంచడం, నిర్వహణ వ్యయాలను సమర్థంగా నియంత్రించడం ద్వారా మెట్రో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చని భావిస్తున్నారు.

అయితే, మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది? రుణాల పునర్వ్యవస్థీకరణకు బ్యాంకుల నుంచి ఎలాంటి నిబంధనలు లభిస్తాయి? అనే అంశాలు కీలకంగా మారాయి. స్వాధీన ప్రక్రియలో పురోగతి, వడ్డీ రేట్ల తగ్గింపు, ఆదాయ వృద్ధి వంటి అంశాలపైనే హైదరాబాద్‌ మెట్రో భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *