ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పుష్పశోభతో ముస్తాబైంది. జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ప్రధాన ఆలయం నుంచి రాజగోపురం, అంతరాలయం, పరిసర ప్రాంతాల వరకు వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వర్ణవర్ణాన్ని తలపించే పూల అమరికలు, ఆకర్షణీయమైన రంగుల కలయికలు ఆలయానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు పుష్పాలంకరణ కనువిందు చేస్తోంది.

బెంగళూరు నుంచి ప్రత్యేక పుష్పాలు

ఆలయ అలంకరణ కోసం గ్లాడియోలస్‌, ఆంథూరియం, హైడ్రేంజియా, వైట్‌ ఆర్కిడ్‌, బ్లూ ఆర్కిడ్‌, గులాబీలు, జిప్సోఫిలా, వివిధ రంగుల డైసీలతో పాటు ఇతర అలంకరణ పుష్పాలను ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తీసుకొస్తున్నారు. పూలతోపాటు వివిధ రకాల ఆకులను వినియోగిస్తూ ఆలయ నిర్మాణానికి అనుగుణంగా అందమైన అలంకరణలు రూపొందిస్తున్నారు. పుష్పాల రంగులు, అమరికల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఆలయానికి కొత్త కళను తీసుకొస్తున్నారు.

2009 నుంచి పుష్పాలంకరణ సంప్రదాయం

కనకదుర్గమ్మ ఆలయం, రాజగోపురం తదితర ప్రాంతాలను పూలతో అలంకరించే సంప్రదాయం 2009 నుంచి కొనసాగుతోంది. తొలినాళ్లలో దాతలు విరాళాలు అందించి ఈ కార్యక్రమానికి సహకరించేవారు. అయితే ఏటా పుష్పాలంకరణ ఖర్చులు పెరుగుతుండటంతో ప్రస్తుతం దేవస్థానం ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 11 రోజులపాటు రోజుకో ప్రత్యేక అలంకరణతో ఆలయాన్ని పుష్పశోభితంగా తీర్చిదిద్దుతున్నారు.

అర్ధరాత్రి తర్వాత అలంకరణ పనులు

అమ్మవారి దర్శనాలు రాత్రి 11 గంటలకు ముగిసిన అనంతరం పుష్పాలంకరణ పనులు ప్రారంభమవుతాయి. ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగారావు నేతృత్వంలో సుమారు 100 మంది సిబ్బంది ఈ పనుల్లో పాల్గొంటున్నారు. ఆలయ సిబ్బందితోపాటు పారిశుద్ధ్య, పుష్పాలంకరణ విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. పోలీసు, వైదిక కమిటీ, పారిశుద్ధ్య విభాగాలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలంకరణ పనులు పూర్తి చేస్తున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *