
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న స్టార్‌లింక్.. భారత్‌లోనూ తన సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, దేశంలో స్టార్‌లింక్ ప్రవేశానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆరోపించారు. ఈ క్రమంలోనే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. “భారత్‌లో అసలు బాస్ అంబానీయేనా?” అంటూ మస్క్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించడంతో రాజకీయంగా మరింత ఆసక్తి నెలకొంది.
భారత్‌లో కొందరు బడా వ్యాపారవేత్తల గుత్తాధిపత్యం కొనసాగుతోందంటూ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కంటే పెట్టుబడిదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు ఆయన స్పందించారు. ఈ సందర్భంగా స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతులు ఎందుకు లభించడం లేదని ప్రశ్నిస్తూ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.
“స్టార్‌లింక్ ఇప్పటికే 165కు పైగా దేశాల్లో లైసెన్సులు పొందింది. భారత ప్రభుత్వ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకునేందుకు ఐదేళ్ల సమయం కేటాయించాం. అయినప్పటికీ ఇప్పటివరకు లైసెన్స్ ఎందుకు మంజూరు కాలేదు? భారత్‌లో అసలు అధికారం ఎవరికి ఉంది.. అంబానీయే నిజమైన బాసా?” అంటూ మస్క్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
ఇదే అంశంపై మస్క్ గతంలోనూ స్పందించారు. భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశాన్ని కొందరు శక్తులు అడ్డుకుంటున్నాయని, తమ వ్యాపార గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు కొందరు బడా వ్యాపారవేత్తలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, దేశంలోని పలు గ్రామాల్లో ఇప్పటికీ 4G నెట్‌వర్క్ సదుపాయం లేదని డోజ్‌డిజైనర్ అనే నెటిజన్ చేసిన పోస్ట్‌కు కూడా ఆయన స్పందించారు. 2026 మే నాటికి దాదాపు 11,256 గ్రామాల్లో 4G కవరేజీ లేదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అయితే, గతంలో చేసిన వ్యాఖ్యల్లో మస్క్ ఎవరినీ నేరుగా లక్ష్యంగా చేసుకోలేదు. తాజాగా మాత్రం అంబానీ పేరును ప్రస్తావిస్తూ ప్రశ్నలు సంధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశం, టెలికాం రంగంలో పోటీ, బడా సంస్థల ఆధిపత్యంపై మరోసారి చర్చ మొదలైంది.
