
ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇది కొత్త తరహా ఉగ్రవాదానికి సంకేతమా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.
భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి తాజాగా ఓ ఆంగ్ల న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, ఇజ్రాయెల్‌లకు కొత్త తరహా ఉగ్రవాదం నుంచి పెను ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.
ఉగ్రవాద సంస్థలు గతంలో కంటే భిన్నంగా పరస్పరం సహకరించుకుంటూ తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఇందుకు ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. ఈ పరిణామాలు భవిష్యత్‌లో ఉగ్రవాదం మరింత కొత్త రూపాల్లో విస్తరించే ప్రమాదాన్ని సూచిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్‌తో పాటు ఇజ్రాయెల్‌కు కొత్త తరహా ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ హెచ్చరించారు. ప్రభుత్వాలు, భద్రతా సంస్థల కంటే ఉగ్రవాద సంస్థలు మరింత వేగంగా తమ సామర్థ్యాలను పెంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఫ్లైదుబాయ్ ఘటన నేపథ్యంలో ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రువెన్ అజార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పొరుగున ఉన్న ఉగ్రవాద సంస్థలకు హమాస్ ఏ విధంగా ప్రేరణగా మారే అవకాశం ఉందో ఆయన వివరించారు. ఉగ్రవాదులు తమ వ్యూహాలను వేగంగా మార్చుకుంటున్న నేపథ్యంలో.. వారిని అడ్డుకోవాలంటే ప్రభుత్వాలు, భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా, వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
‘‘ఉగ్రవాదులు మనకంటే వేగంగా పనిచేస్తున్నారు. వారిని అధిగమించాలంటే మనం మరింత వేగంగా స్పందించాలి. భవిష్యత్‌లో చోటుచేసుకునే ఉగ్రదాడుల కంటే ముందుండాలంటే అత్యంత అప్రమత్తంగా, వేగంగా వ్యవహరించాలి. మరో తీవ్రవాద దాడి జరిగే అవకాశం తప్పకుండా ఉంది’’ అని అజార్ హెచ్చరించారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రువెన్ అజార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మారుతున్న ఉగ్రవాద వ్యూహాలను ఎదుర్కొనేందుకు భారత్, ఇజ్రాయెల్ సహా ఇతర దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
ఉగ్రవాద సంస్థలు పరస్పరం సహకరించుకుంటున్నాయా అన్న ప్రశ్నకు స్పందించిన రువెన్.. పశ్చిమాసియా పరిధిని దాటి హమాస్ తన ప్రభావాన్ని విస్తరిస్తున్న తీరును ప్రస్తావించారు. గత ఏడాది కాలంలో హమాస్‌కు చెందిన పలువురు అగ్రశ్రేణి కమాండర్లు బంగ్లాదేశ్, పాకిస్థాన్లలో పర్యటించినట్లు పలు నివేదికలు వెల్లడించాయని తెలిపారు. నాజీ జహీర్, ఖలీద్ అల్ కదుమీ వంటి హమాస్ నేతలు జైషే మహమ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అలాగే, లష్కరే కేడర్‌కు ఆపరేషన్ విధానాల్లో హమాస్ శిక్షణ ఇస్తున్నట్లు ఇటీవల నిఘా నివేదికలు వెల్లడించాయని చెప్పారు.
ఈ పరిణామాలకు ఉదాహరణగా గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని రువెన్ ప్రస్తావించారు. ఈ ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థలపై హమాస్ ప్రభావం కనిపిస్తోందని, పహల్గామ్ దాడి కూడా అదే ప్రభావానికి ప్రతిబింబంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. హమాస్ ప్రతినిధులు ఈ ప్రాంతానికి వచ్చి సమావేశాలు నిర్వహిస్తున్నారని, అయితే తెరవెనుక జరుగుతున్న పరిణామాలపై పూర్తి సమాచారం అందుబాటులో లేదని పేర్కొన్నారు.
ఇదే సమయంలో అజార్ మాట్లాడుతూ.. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజాస్వామ్య దేశాలు తమ భద్రతా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్‌పై కో-పైలట్ దాడి చేసి, విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాడనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ.. ఇజ్రాయెల్ రాయబారి చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఒమాన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్ హమామీ చేసిన ప్రయత్నాలను భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ అడ్డుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో కెప్టెన్ తీవ్రంగా గాయపడినప్పటికీ, కీలక సమయంలో కాక్‌పిట్ తలుపును తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే, కో-పైలట్ ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడా? లేక దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ ఘటనను తక్షణ ముప్పుగా అభివర్ణించిన ఇజ్రాయెల్ రాయబారి అజార్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదులు, ఇరాన్ పాలకులు తమ ఉనికిని చాటుకునేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోరని హెచ్చరించారు.
“ఇది ప్రస్తుతం ఉన్న ముప్పు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాము ఇంకా ఓడిపోలేదని నిరూపించుకునేందుకు ఉగ్రవాదులు, ఇరాన్ పాలకులు ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తారు” అని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనలో ఇరాన్ ప్రమేయం ఉండొచ్చనే అనుమానాన్ని అమెరికా అధ్యక్షుడు వ్యక్తం చేసినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటివరకు అలాంటి ఆరోపణలను అంగీకరించలేదు.
