
ఘటనా స్థలంలోనే నిందితుడిని ఫిర్యాదుదారు పట్టుకుని పోలీసులకు అప్పగించినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో యూపీ పోలీసుల తీరుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులకు ఓ నిర్దిష్ట ‘ఎజెండా’ ఉందని, దానికి అనుగుణంగానే దర్యాప్తులు సాగుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
పోలీసుల వ్యవహారశైలి ఇలాగే కొనసాగితే ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవసరమైతే పోలీసు వ్యవస్థను రద్దు చేసి, కేసులన్నింటినీ సీబీఐకి అప్పగించే అధికారం తమకు ఉందంటూ కోర్టు తీవ్ర హెచ్చరిక చేసింది. పోలీసుల దర్యాప్తు తీరుపై అత్యున్నత న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కేసుల దర్యాప్తులో ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదే విధమైన వైఖరి కొనసాగితే రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థను రద్దుచేసి, అన్ని కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సి వస్తుందని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాతో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
‘‘ప్రతి విషయంలో మీకంటూ ఓ ఎజెండా ఉంటుంది. ఇలాగే దర్యాప్తులు కొనసాగితే ప్రజలు పోలీసులను ఎలా విశ్వసిస్తారు? యూపీ పోలీసులు తమ దర్యాప్తులన్నింటినీ సీబీఐకి అప్పగించుకోవడం మంచిది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవసరమైతే పోలీసు వ్యవస్థను రద్దు చేసే అధికారం తమకు ఉందని, ఈ తరహా వ్యవహారాలకు ఏదో ఒకచోట ముగింపు పలకాల్సిందేనని స్పష్టం చేసింది.
ఓ కేసులో నిందితుడిని ఫిర్యాదుదారు ఘటనా స్థలంలోనే పట్టుకుని పోలీసులకు అప్పగించినప్పటికీ, ఎఫ్ఐఆర్లో అతడిని ‘అపరిచిత వ్యక్తి’గా పేర్కొనడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. పోలీసుల దర్యాప్తు తీరుపై పిటిషనర్ ఇప్పటికే ఆరోపణలు చేశాడు. పోలీసులు ముందునుంచే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, నిందితుడిని ఘటనా స్థలంలోనే పట్టుకుని పోలీసులకు అప్పగించినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, సంబంధిత కాలమ్‌ను ఖాళీగా ఉంచారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
తర్వాత ఈ కేసులో హైకోర్టు జోక్యం చేసుకుని స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. దీంతో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సదరు మోటార్‌సైకిలిస్ట్ పేరును చేర్చారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే, ఆ తర్వాత అతడికి క్లీన్చిట్ ఇచ్చారని పేర్కొన్నారు.
అంతేకాకుండా, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సమయంలో దానికి నంబర్ ప్లేట్ లేదని, అయితే దర్యాప్తు సమయంలో దానికి రిజిస్ట్రేషన్ నంబర్ అమర్చినట్లు పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘చెప్పినట్లు వినడం ఒక ఎత్తయితే.. దానికి మించి దేనికైనా సిద్ధపడటం మరో ఎత్తు. ఆ తర్వాత ఇలాంటి విషయాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం మరింత ఆందోళనకరం. వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది’’ అని వ్యాఖ్యానించింది.
ఘటనా స్థలంలోనే పట్టుబడిన నిందితుడి పేరును ఎఫ్ఐఆర్లో ఎందుకు నమోదు చేయలేదని కూడా ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. ‘‘పరిస్థితులు మీకు అనుకూలంగా మారితే పేరును మార్చేస్తారా? లేక మీకు తెలిసిన వ్యక్తి పేరును అందులో చేర్చుతారా? ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి విధానమే కొనసాగుతోందా?’’ అంటూ తీవ్రంగా ప్రశ్నించింది.
యూపీ పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌పై కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
