ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్‌.. ఈ నిర్ణయం తీసుకున్నారు.

మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎమ్మెల్సీలంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జగన్‌ సూచించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఇటీవల వరకు జకియా ఖానం ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా కొనసాగారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న ఆమె పదవీకాలం పూర్తవడంతో డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ స్థానం ఖాళీ అయింది. త్వరలో శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ పదవికి ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది.

మండలిలో వైసీపీకి ఉన్న సంఖ్యాబలంతో మాధవరావు ఎన్నికపై ఆసక్తి నెలకొంది. మరోవైపు అధికార కూటమి వ్యూహం ఎలా ఉండబోతోందన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

By Ramya