• ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన సోమవారం అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.
  • శరన్నవరాత్రుల మొదటి రోజైన ఆదివారం సుమారు లక్ష మంది భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకున్నట్లు సమాచారం. రెండో రోజు కూడా భక్తుల రాక కొనసాగుతోంది. గాయత్రీదేవిని సకల వేద స్వరూపిణిగా పూజిస్తారని పండితులు చెబుతున్నారు. సమస్త మంత్రాలకు మూలశక్తిగా అమ్మవారిని ఆరాధిస్తారని వివరించారు.
  • గాయత్రీదేవి ఐదు ముఖాలతో, ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో దర్శనమిస్తారని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించిన అమ్మవారిని ఉపాసించడం ద్వారా మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం లభిస్తాయని విశ్వాసం. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా ఆరాధించినట్లు పేర్కొంటున్నారు.
  • ప్రాతఃకాలంలో గాయత్రీగా, మధ్యాహ్న సమయంలో సావిత్రిగా, సాయంసంధ్య వేళ సరస్వతిగా పరమేశ్వరిని ఉపాసిస్తారని పురాణాలు వివరిస్తున్నాయి. గాయత్రీమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురోహితులు తెలిపారు.

శ్రీశైలంలో బ్రహ్మచారిణి అలంకరణలో భ్రమరాంబాదేవి

  • నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలోనూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజైన సోమవారం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు.
  • భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం రాత్రి స్వామివారికి, అమ్మవారికి మయూర వాహనంపై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీశైలం పురవీధుల్లో గ్రామోత్సవం జరగనుంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *