స్థానిక సంస్థల ఎన్నికల బందోబస్తును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఎన్నికల భద్రత పోలీసుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ‘K-ORBIT’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు.

జిల్లాలోని మొత్తం 2,064 పోలింగ్ కేంద్రాలతో పాటు 104 పోలీసు వాహనాలను ఈ యాప్‌కు డిజిటల్‌గా అనుసంధానం చేశారు. లైవ్ జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయం ద్వారా ప్రతి 10 సెకన్లకు ఒకసారి పోలీసు వాహనాల కదలికలను తెలుసుకునే అవకాశం కల్పించారు. దీంతో బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బంది ఎక్కడ ఉన్నారు? వారి కదలికలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు యాప్‌లో ప్రత్యేకంగా SOS అలర్ట్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఈ అలర్ట్ ద్వారా సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసి వెంటనే సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.

తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ పనిని సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో K-ORBIT యాప్‌ను రూపొందించినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పోలీసు బందోబస్తును సమన్వయం చేయడం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం వంటి అంశాల్లో ఈ యాప్ కీలకంగా ఉపయోగపడనుంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *