
న్యూఢిల్లీ: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) సస్పెండ్ చైర్మన్ శివశంకరప్ప ఎస్. షౌకార్, సభ్యురాలు బీవీ గీతను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. బెంగళూరులోని డాలర్స్ కాలనీలో శివశంకరప్ప నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం ఈ చర్యలు చేపట్టారు.
వెటర్నరీ పోస్టుల నియామక పరీక్షలో అవకతవకలు జరిగాయన్న కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రశ్నాపత్రం లీక్, ఉద్యోగాల కోసం డబ్బుల డిమాండ్, ఇంటర్వ్యూల సమయంలో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని కూడా ఈడీ పరిశీలిస్తోంది.
మంగళవారం శివశంకరప్పను విచారించి వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు. మరో బృందం బీవీ గీతను కూడా అరెస్టు చేసింది. శివశంకరప్పకు సమీప బంధువైన సుగురేశ్ నుంచి కూడా అధికారులు వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం.
జనవరి 8న వెటర్నరీ శాఖలోని 400 ఆఫీసర్, గెజిటెడ్ పోస్టులకు నిర్వహించిన పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో సస్పెండైన ఐఏఎస్ అధికారి, కేపీఎస్సీ మాజీ ఎగ్జామ్ కంట్రోలర్ జ్ఞానేంద్ర కుమార్ గంగావర్, రాజకీయ కార్యకర్త బసవరాజ్ కన్నాలేను కూడా ఈడీ విచారించింది.
శివశంకరప్ప 2019లో కేపీఎస్సీ సభ్యుడిగా, 2021లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. తప్పుడు ఆదాయ ధ్రువపత్రాల వ్యవహారంలోనూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వెటర్నరీ పోస్టుల నియామకాల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలడంతో ఈడీ ఆర్థిక కోణంలో విచారణ కొనసాగిస్తోంది.
