మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతిపితకు ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలను, ఆయన అనుసరించిన సత్యం, అహింస, శాంతి, సేవ వంటి విలువలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.

ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన శాంతి, సహనం, సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, స్వచ్ఛత వంటి గాంధీజీ ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాంధీజీకి నివాళులర్పిస్తూ అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాలను ఆయుధాలుగా మలిచి స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపిన మహాత్ముడి జీవితం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్నారు. సత్యం, అహింస, సేవ, స్వచ్ఛత వంటి విలువలను గాంధీజీ ఆచరణలో చూపించారని సమాజంలో సమానత్వం, సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి ఘన నివాళులు అర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడమే కాకుండా ప్రపంచానికి అహింసా మార్గాన్ని చూపిన మహనీయుడు గాంధీజీ అని పేర్కొన్నారు. గాంధీజీ పాటించిన విలువలు సూచించిన మార్గదర్శకాలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని సూచించారు.

By Rajini