
విశాఖపట్నం, ఆంధ్రప్రభ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తక్షణ సాయం అందించారు. విశాఖపట్నంలోని ఆరిలోవ హెల్త్ సిటీ బీఆర్‌టీఎస్ రోడ్డులో జరిగిన ప్రమాదాన్ని గమనించిన ఆమె.. తన వాహనాన్ని నిలిపి బాధితుల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులను దగ్గరుండి ఆస్పత్రికి తరలించడంతో పాటు, వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆపద సమయంలో ఆమె స్పందించిన తీరుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద స్థలంలో ఆగి.. విద్యార్థులకు భరోసా
విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూటీని బొలెరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. విశాఖపట్నం నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు మీదుగా పాయకరావుపేట వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి అనిత ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపారు.
గాయపడిన విద్యార్థుల వద్దకు వెళ్లి వారికి తక్షణ సాయం అందించారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించడంతో పాటు, ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
గతంలోనూ ప్రమాద బాధితులకు అండగా
హోంమంత్రి అనిత గతంలోనూ ప్రమాద బాధితులకు సాయం అందించారు. గత ఏడాది విశాఖలోని గాజువాక జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటన సమయంలోనూ ఆమె తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారిని పరామర్శించి, బాధితులకు తక్షణ సాయం అందేలా అధికారులను ఆదేశించారు. బాధితులను ఆస్పత్రికి తరలించే వరకు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు.
తాజాగా మరోసారి ప్రమాద బాధిత విద్యార్థులకు సాయం అందించడంతో ఆమె స్పందనపై స్థానికులు, పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
