
కత్తిపూడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన నలుగురు భవానీ భక్తులు మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ ఘటనపై స్పందిస్తూ నలుగురు భవానీ భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతులకు నివాళులర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికారులకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. భవానీ భక్తుల మృతి తనను కలచివేసిందని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు అత్యవసర వైద్య సేవలు, అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అమ్మవారు ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.
