
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ విధానంలో స్వల్ప మార్పు రానుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పింఛన్ మొత్తంలో కొంత నగదు రూపంలో, మరికొంత నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటివరకు మొత్తం పింఛన్ మొత్తాన్ని సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల చేతికే అందించేవారు.
ఇకపై పింఛన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలుగా విభజించి పంపిణీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం వాటా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కాగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటాను సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు రూపంలో అందిస్తారు.
రూ.4,000 పెన్షన్‌లో ఎంత చేతికి?
వృద్ధులకు నెలకు అందే రూ.4,000 పింఛన్లో రూ.3,800 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా లబ్ధిదారులకు చేతికి అందుతుంది. మిగిలిన రూ.200 కేంద్ర ప్రభుత్వ వాటాగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
అదే విధంగా దివ్యాంగులకు అందే రూ.6,000 పింఛన్లో రూ.5,700 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చేతికి అందించగా.. రూ.300 కేంద్ర వాటా నేరుగా బ్యాంకు ఖాతాలో పడుతుంది.
ఆధార్ లింక్ తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వ వాటా బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే లబ్ధిదారుల ఆధార్ బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయి ఉండాలి. ఆధార్ లింక్ లేకపోతే కేంద్ర వాటా జమ కావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే పెన్షన్‌దారులు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం అయిందో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎందుకీ మార్పు?
పెన్షన్ల పంపిణీలో మరింత పారదర్శకత తీసుకురావడం, కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను స్పష్టంగా చూపించడం, కేంద్ర నిధుల పంపిణీలో మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలతో ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే పింఛన్ పంపిణీ తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రతి నెలా 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించే విధానం కొనసాగుతుంది. కాబట్టి లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
