
ఉరవకొండ, అక్టోబర్ 10 అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం మీదుగా వెళ్లే జాతీయ రహదారి ఎన్‌హెచ్-42ను నాలుగు లేన్ల రహదారిగా విస్తరించాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. రహదారి విస్తరణ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ
అనంతపురం–బళ్లారి మార్గంలో పలు గ్రామాల పరిధిలో రహదారిపై ప్రమాదకరమైన మలుపులు ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పయ్యావుల కేశవ్ వివరించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి ప్రత్యేకంగా లేఖను కూడా అందజేశారు.
71.25 కిలోమీటర్ల మేర విస్తరణ ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్–కర్ణాటక సరిహద్దు నుంచి అనంతపురం వరకు ఎన్‌హెచ్-42లో కిలోమీటరు 4/350 నుంచి 75/600 వరకు ఉన్న సుమారు 71.25 కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్లుగా ఉన్నతీకరించాలని మంత్రి కోరారు. ప్రస్తుతం ఈ రహదారి రెండు లేన్లతో పాటు పలు చోట్ల మెరుగుపరచాల్సిన అడ్డ, నిలువు మలుపులతో ఉందని పేర్కొన్నారు.
ఈ రహదారి అధిక జనాభా కలిగిన ప్రాంతాలు, పలు పరిపాలనా కేంద్రాలు, నివాస ప్రాంతాల మీదుగా వెళుతుందని తెలిపారు. అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని ఉరవకొండ, కూడేరు, విడపనకల్లు మండలాలు, 15 గ్రామాలకు ఈ రహదారి కీలక అనుసంధాన మార్గంగా ఉందని వివరించారు.
రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడం ద్వారా ప్రయాణ భద్రత మెరుగుపడటంతో పాటు రాకపోకలు సులభతరం అవుతాయని, ప్రాంతీయ రవాణా వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
